Header Banner

శ్రీరామనవమి శుభాకాంక్షలతో! సీతారామ కళ్యాణం, పానకం, వడపప్పు విశిష్టత!

  Sun Apr 06, 2025 00:01        Wishes (శుభాకాంక్షలు)

త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గామధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. అభిజీత్ ముహూర్తంలో జన్మించిన ఆ మహనీయుడి జన్మదినాన్ని మనం పండుగల చేసుకుంటాం.అయితే చైత్ర శుద్ధ నవమి నాడే సీతా రాముల కల్యాణం జరిగిందని కూడా చెబుతుంటారు.


అంతే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం తర్వాత. ఇదే ముహూర్తంలో సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడట. వీటన్నిటిని పురస్కరించుకొని మనం శ్రీరామ నవమి పండుగను నిర్వహించుకుంటాం. ఇదే రోజున సీతారాముల వివాహం జరిగింది కాబట్టి ప్రతీ ఏటా ఇదే రోజున వీరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు.


శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని విశ్వాసం.


శ్రీరామ మంత్రం
"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే " అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.


ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.


శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పుకు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం.


మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.
సర్వేజనా సుఖినోభవంతు...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆంధ్ర ప్రవాసి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Wishes #SriRamaNavami #Festivals #Indians #Religious #Spiritual #Devotional